23/08/2026
అనంత కరువుపై అసెంబ్లీలో ఎందుకు నోరు మెదపలేదు..!
▪️ప్రజల సమస్యల కంటే చంద్రబాబు భజనే ముఖ్యమా..!
▪️పయ్యావుల పొగడ్తలు అనంతపురానికి ఏం తెచ్చాయి..!
▪️చంద్రబాబు అనంతపురానికి ఏం చేశారు..!
▪️కిలోమీటర్ రోడ్డుకు రూ.150 కోట్లు ఎందుకు?
▪️కరువుతో రైతులు వణికిపోతున్నారు..!
▪️రైతుకు రూ.23 వేల వరకు భరోసా బకాయి..!
▪️రూ.4 వేల కోట్ల లైనింగ్.. రైతులకు నష్టమే..!
▪️సవితమ్మా.. చంద్రబాబు పొగడ్తలు కాదు, రైతుల సమస్యలు మాట్లాడండి..!
▪️జగన్ తెచ్చిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఎందుకు రద్దు చేశారు?
▪️క్రెడిట్ కోసం ఆలోచిస్తే నష్టపోయేది రైతులే
▪️సునీతమ్మా.. 30 శాతం నీళ్లు అడగడం గొప్ప విషయం కాదు..!
▪️కరువు మళ్లీ వలసల వైపు నెట్టకండి..!
▪️పయ్యావుల కేశవ్.. పదవి కాదు, జిల్లా ప్రయోజనం ముఖ్యం..!
▪️దోపిడీ విధానం మానుకోకపోతే చరిత్రలో కలిసిపోతారు..!
– రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
👉అనంతపురం జిల్లాలో పరిస్థితులు అత్యంత అధ్వానంగా ఉన్నా నాలుగు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో జిల్లాకు సంబంధించిన ఒక్క సమస్యను కూడా ప్రస్తావించకపోవడం బాధాకరమని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ వేదికగా సీఎం దృష్టికి జిల్లా సమస్యలను తీసుకెళ్లే గొప్ప అవకాశాన్ని 14 మంది ఎమ్మెల్యేలు సద్వినియోగం చేసుకోలేదని విమర్శించారు. శనివారం అనంతపురంలోని జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
“అసెంబ్లీలో ప్రజల గొంతు వినిపించాలి.. భజన కాదు”
👉జిల్లాలో పెడబబ్బులు పెట్టే నాయకులు అసెంబ్లీలో మాత్రం పనికొచ్చే మాటలు మాట్లాడలేదని ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఎంతసేపూ చంద్రబాబుకు భజన చేయడమే సరిపోతోందా? అని ప్రశ్నించారు. ప్రజలు తమ సమస్యలను చెప్పాలని గెలిపిస్తే.. ముఖ్యమంత్రి పొగడ్తలకే అసెంబ్లీ వేదికను ఉపయోగించుకోవడం దురదృష్టకరమన్నారు.
“సూపర్‌సిక్స్ హామీలు ఏమయ్యాయి..”
👉బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్లు, మహిళలకు నెలకు రూ.1,500, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భతి, ఉద్యోగాల హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ఇవన్నీ అటకెక్కించినా సూపర్‌సిక్స్ అద్భుతంగా అమలవుతోందంటూ చంద్రబాబుకు వంగి వంగి దండాలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.
“రైతు భరోసా అరకొర.. సున్నా వడ్డీ ఏదీ..”
👉రైతు భరోసా అరకొరగా ఇచ్చారని, మహిళలకు సున్నా వడ్డీ పథకం అమలు కావడం లేదన్నారు. గత ప్రభుత్వం డ్వాక్రా మహిళల రుణాలపై చేసిన వడ్డీ మాఫీ కూడా నిలిచిపోయిందని విమర్శించారు. ప్రజలు సిగ్గుపడేలా వ్యవహరించకుండా తమను గెలిపించిన ప్రజల కోసం పనిచేయాలని ఎమ్మెల్యేలకు హితవు పలికారు.
“పయ్యావుల పొగడ్తలు అనంతపురానికి ఏం తెచ్చాయి?
👉సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ చంద్రబాబును మరీ ఎక్కువగా పొగడ్తలతో ముంచెత్తుతున్నారని ప్రకాష్ రెడ్డి అన్నారు. ‘‘చాలామంది సీఎంలు వచ్చారు..పోయారు.. చంద్రబాబు మాత్రం అలాగే ఉన్నారు’’ అని చెప్పడం కాదు.. అనంతపురం జిల్లాకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
“చంద్రబాబు అనంతపురానికి ఏం చేశారు..”
👉రాష్ట్ర విభజన తర్వాత బస్సులో ఉండి పరిపాలించారని గొప్పగా చెప్పుకోవడం కాదని, అసలు రాష్ట్ర విభజనకు చంద్రబాబు ఇచ్చిన లేఖ కూడా కారణమని ప్రకాష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నేడు అమరావతి పేరుతో అడ్డగోలు ఖర్చులు చేస్తున్నది ఎవరు? ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
“కిలోమీటర్ రోడ్డుకు రూ.150 కోట్లు ఎందుకు?
👉ఒక కిలోమీటరు రోడ్డు నిర్మాణానికి రూ.150 కోట్లు ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించారు. నాలుగు లేన్ల హైవే కిలోమీటరుకు రూ.10–15 కోట్లకు మించి ఖర్చు కాదని అన్నారు. అమరావతి నిర్మాణంలో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
“అమరావతి పేరుతో లక్ష కోట్ల భారం ఎందుకు?
👉మారుమూల ప్రాంతాల్లో వేలాది ఎకరాల భూములు సేకరించి.. మౌలిక సదుపాయాల కోసం మరో లక్ష కోట్లు ఖర్చు చేస్తామని చెప్పడం ప్రజలపై భారం మోపడమేనన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.10–20 వేల కోట్లతో రాజధాని పూర్తిచేయవచ్చని చెప్పినప్పుడు ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని గుర్తుచేశారు.
“కరువుతో రైతులు వణికిపోతున్నారు”
👉ఎల్‌నినో ప్రభావం రాష్ట్రంలో తీవ్రంగా ఉందని, అనంతపురం జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షాలు పడుతుండటంతో రైతులు సాగుకు భయపడుతున్నారని తెలిపారు. పంట వేస్తే దిగుబడి వస్తుందో.. లేదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. రైతుల సమస్యలను అసెంబ్లీలో చర్చించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందన్నారు.
“రైతుకు రూ.23 వేల వరకు భరోసా బకాయి”
రైతు భరోసా కింద ఒక్కో రైతుకు ఇప్పటికీ సుమారు రూ.23 వేల వరకు బకాయిలున్నాయని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. రైతులకు సున్నా వడ్డీ ఇవ్వడం లేదని, ఇన్‌పుట్ సబ్సిడీ విషయంలో కూడా ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందన్నారు. గత ప్రభుత్వం పంట పూర్తయ్యే సమయానికి ఇన్‌పుట్ సబ్సిడీ అందించేదని గుర్తుచేశారు.
“పంటల బీమా భారం కూడా రైతుపైనే”
👉వైఎస్ జగన్ హయాంలో పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లించేదని, ఇప్పుడు ఆ భారాన్ని రైతులపై మోపారని విమర్శించారు. గతంలో బీమా పరిహారం అందకపోవడంతో రైతుల్లో నమ్మకం పోయిందని, అందుకే కొందరు ప్రీమియం చెల్లించడానికి కూడా ముందుకు రావడం లేదన్నారు.
రూ.4 వేల కోట్ల లైనింగ్.. రైతులకు నష్టమే
👉రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి హంద్రీనీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ వేయడం వల్ల వేలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టారని ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. లైనింగ్, పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వకపోవడం వల్ల జిల్లాలో సుమారు 50 వేల బోర్లు ఎండిపోయాయని అన్నారు.
“మరో రూ.800 కోట్లు ఎందుకు వృథా?
👉మడకశిర బ్రాంచ్ కెనాల్‌లో 70 కిలోమీటర్ల మేర కాలువ వెడల్పు, లైనింగ్ పేరుతో సుమారు రూ.800 కోట్లు వథా చేయబోతున్నారని విమర్శించారు. లైనింగ్ కోసం ఖర్చు చేసే నిధులతోనే రైతులకు శాశ్వత ప్రయోజనం కలిగించే బైపాస్ కెనాల్ పూర్తి చేయవచ్చన్నారు.
“సవితమ్మా.. చంద్రబాబు పొగడ్తలు కాదు, రైతుల సమస్యలు మాట్లాడండి”
👉మంత్రి సవిత అసెంబ్లీలో చంద్రబాబును బాగా పొగిడారని, అదే సమయంలో జిల్లాలోని రైతుల సమస్యలను ఎందుకు ప్రస్తావించలేదని ప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. రాజకీయ క్రెడిట్ కోసం కాకుండా రైతుల భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
“జగన్ తెచ్చిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఎందుకు రద్దు చేశారు?
👉గాలేరు–నగరి నుంచి చిత్తూరు, కడప జిల్లాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా హంద్రీనీవా నీటిని అందించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని చంద్రబాబు అనధికారికంగా రద్దు చేశారని ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. ఆ నిర్ణయం వల్లే ఇప్పుడు కాలువకు లైనింగ్ అవసరం వచ్చిందన్నారు.
“లైనింగ్ వద్దు.. బైపాస్ కెనాల్ పూర్తి చేయండి”
👉మడకశిర బ్రాంచ్ కెనాల్ 40వ కిలోమీటరు నుంచి మడకశిర బైపాస్ కెనాల్ 125వ కిలోమీటరు వరకు ఉన్న 85 కిలోమీటర్లను స్కిప్ చేసి నేరుగా బైపాస్ కెనాల్‌కు నీళ్లు అందించే పథకానికి వైఎస్ జగన్ టెండర్లు పిలిచారని తెలిపారు. ఆ పనులను వెంటనే ప్రారంభించాలని సవితను డిమాండ్ చేశారు.
“264 చెరువులు.. అందులో 175 మడకశిరలోనే”
👉264 చెరువులకు నీరు నింపాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ కాలువ నిర్మాణానికి పూనుకున్నారని ప్రకాష్‌రెడ్డి గుర్తుచేశారు. ఇందులో సుమారు 175 చెరువులు మడకశిర నియోజకవర్గంలోనే ఉన్నాయని తెలిపారు. 40వ కిలోమీటరు నుంచే బైపాస్ చేస్తే నేరుగా ఆ చెరువులకు నీరు అందించవచ్చన్నారు.
“మడకశిర నుంచి హిందూపురం.. పెనుకొండ వరకు ప్రయోజనం”
👉బైపాస్ కెనాల్ ద్వారా మడకశిర చెరువులను నింపడంతోపాటు మిగిలిన నీటిని హిందూపురం, పెనుకొండ ప్రాంతాల చెరువులకు కూడా వినియోగించవచ్చని తెలిపారు. లైనింగ్ కోసం వథా చేసే నిధులను బైపాస్ కెనాల్‌కు మళ్లిస్తే రైతులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.
“క్రెడిట్ కోసం ఆలోచిస్తే నష్టపోయేది రైతులే”
👉ప్రాజెక్టులకు ఎవరి క్రెడిట్ వస్తుందన్న దానికంటే రైతులకు నీళ్లు అందుతాయా లేదా అన్నదే ముఖ్యమని ప్రకాష్‌రెడ్డి అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటే సర్వనాశనం అయ్యేది రైతులేనని హెచ్చరించారు. లైనింగ్ వేస్తే రాజకీయంగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
“రైతులు ఇళ్ల వద్దకు వచ్చే పరిస్థితి వస్తుంది”
👉లైనింగ్ నిర్ణయాన్ని మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో రైతులు ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్దకు వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి వస్తుందని ప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు. సహజంగా వేరుశనగ పంట పండకపోతే కంది వేసుకునే రైతులకు ఈసారి కంది కూడా లేకుండా పోయిందన్నారు. పత్తి పరిస్థితి కూడా దారుణంగా ఉందన్నారు.
“14 మంది ఎమ్మెల్యేలు ఉన్న జిల్లాకు ఏం చేస్తున్నారు?
👉అనంతపురం జిల్లా 14 మంది శాసనసభ్యులను ఇచ్చినా జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడటం లేదని ప్రకాష్‌రెడ్డి నిలదీశారు. అనంత కరువు గురించి అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. ‘‘మా మాటలు నమ్మొద్దు.. గ్రామాల వారీగా సచివాలయాల ద్వారా బోర్లు ఎన్ని ఎండిపోయాయో సేకరించండి’’ అని సవాల్ విసిరారు.
“సునీతమ్మా.. 30 శాతం నీళ్లు అడగడం గొప్ప విషయం కాదు”
👉పరిటాల సునీత అసెంబ్లీలో చెరువులకు 30 శాతం నీళ్లు నింపాలని అడగడంపై ప్రకాష్ రెడ్డి స్పందించారు. ఇరిగేషన్ అధికారులు ఎలాగూ చివరి నుంచి చెరువులు నింపుకుంటూ వస్తారని, అసలు సమస్యపై మాట్లాడాలని సూచించారు. హంద్రీనీవా లైనింగ్, పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వకపోవడమే ప్రస్తుత దుస్థితికి కారణమని ఆరోపించారు.
“పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వండి”
👉‘‘వెయ్యి అడుగులు వేసినా నీళ్లు పడలేదు’’ అని చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించుకోవాలని సునీతకు సూచించారు. హంద్రీనీవా కాలువకు లైనింగ్ వేయడం, పేరూరు డ్యాంకుకు నీళ్లు ఇవ్వకపోవడం వల్లే సమస్య తీవ్రమైందన్నారు. ఇప్పటికైనా తప్పును గుర్తించి పేరూరు డ్యాంకుకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు.
“రూ.55 కోట్ల బకాయిలు చెల్లిస్తే నాలుగు మండలాలకు తాగునీరు”
👉ఏబీఆర్ నుంచి పాపంపేట వరకు తాగునీరు అందించే పథకాన్ని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. కాంట్రాక్టర్లకు సుమారు రూ.55 కోట్ల బకాయిలు చెల్లిస్తే ఆత్మకూరు, అనంతపురం రూరల్, కగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాలకు తాగునీరు అందుతుందని చెప్పారు.
“ట్యాంకర్ల కోసం కోట్లు కాదు.. శాశ్వత తాగునీటి పరిష్కారం కావాలి”
👉మండలానికి రూ.కోటి చొప్పున ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని అడగడం తాత్కాలిక పరిష్కారం మాత్రమేనన్నారు. స్థానిక నాయకులకు దోపిడీకి అవకాశం కల్పించే విధానాలకు బదులుగా శాశ్వత తాగునీటి పథకాలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
“జీడిపల్లి–అప్పర్ పెన్నార్ రైతుల బకాయిలు ఎప్పుడు?
👉జీడిపల్లి–అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు భూసేకరణకు రైతులకు చెల్లించాల్సిన సుమారు రూ.200 కోట్లను ఎందుకు అడగలేదని మంత్రి పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, అమిలినేని సురేంద్రబాబును ప్రశ్నించారు. జీడిపల్లి–బీటీపీ ప్రాజెక్టుకు సంబంధించి మరో రూ.100 కోట్ల భూసేకరణ బకాయిలు ఉన్నాయని తెలిపారు.
“మళ్లీ వలసల వైపు నెట్టకండి”
👉ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీఇన్నీ కావని ప్రకాష్‌రెడ్డి అన్నారు. 2014–19 మధ్య తీవ్ర కరువుతో రైతులు కేరళకు వలస వెళ్లి భిక్షాటన చేసిన రోజులు మళ్లీ రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే రైతుల ఆగ్రహాన్ని ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
“పయ్యావుల కేశవ్.. పదవి కాదు, జిల్లా ప్రయోజనం ముఖ్యం”
👉మంత్రి పయ్యావుల కేశవ్ జిల్లాకు జరుగుతున్న నష్టంపై లీడ్ తీసుకుని మాట్లాడాలని ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. పదవిని కాపాడుకోవడం కంటే అనంతపురం రైతుల ప్రయోజనాల కోసం నిలబడాలని సూచించారు. ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని, అదే నిధులతో రైతులకు నాలుగు రెట్లు ప్రయోజనం కలిగే పనులు చేయవచ్చన్నారు.
“దోపిడీ విధానం మానుకోకపోతే చరిత్రలో కలిసిపోతారు”
👉ప్రజాధనాన్ని వృథా చేసే విధానాలను వెంటనే మార్చుకోవాలని ప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు. రైతులకు ఉపయోగపడేలా ప్రాజెక్టుల ప్రాధాన్యతలను మార్చాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలు, రైతులు తగిన సమాధానం చెబుతారని హెచ్చరిస్తూ.. ‘‘తస్మాత్ జాగ్రత్త’’ అంటూ ప్రభుత్వ పెద్దలకు ప్రకాష్‌రెడ్డి గట్టి హెచ్చరిక జారీ చేశారు.